⍟ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. ఇక, ఐరోపా దేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొన్ని వారాలుగా కొవిడ్-19 అక్కడ విలయతాండవం చేస్తోంది. వైరస్‌గా హాట్‌స్పాట్‌గా మారిపోయిన ఐరోపాలో పరిస్థితి ఉచ్ఛ స్థితికి చేరుకోనుంది. ప్రపంచంలోని మొత్తం కరోనా మరణాల్లో అత్యధికంగా ఐరోపాలో చోటుచేసుకున్నాయి. గత 24 గంటలలో స్పెయిన్‌లో 950, ఇటలీలో 800, బ్రిటన్‌లో 569 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడా దేశాల్లో పరిస్థితి మెల్లమెల్లగా కుదురుకుంటోంది. మహమ్మారి నియంత్రణలోకి వస్తోందని, సంక్రమణ మందగించిందని స్పెయిన్ ఆరోగ్య మంత్రి సాల్వడార్ అన్నారు. రెండు రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య కూడా తక్కువగా నమోదవుతోంది
⍟కరోనా వైరస్ మహమ్మారి సోకినవారికి వైద్యం, సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తులకు ఏప్రిల్ 4న జాతీయ సంతాప దినంగా పాటించాలని చైనా నిర్ణయించింది. కరోనాపై పోరాటంలో తమ జీవితాన్ని ఫణంగా పెట్టిన వైద్యులు, ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా నివాళులర్పించనున్నారు. కరోనా వీరుల గౌరవార్దం దేశంతోపాటు వివిధ దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో చైనా జాతీయ పతాకాన్ని సగానికి దించి ఎగురవేయాలి.. ప్రజలు తమ వినోద కార్యక్రమాలను కూడా రద్దుచేసుకోవాలని ఈ మేరకు చైనా అధికారిక మీడియా ప్రకటించింది.
⍟ కరోనా వైరస్ నియంత్రణకు ఒడిశా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. మిగతా రాష్ట్రాల కంటే ముందుగానే లాక్‌డౌన్ విధించిన నవీన్ పట్నాయక్.. కోవిడ్-19 బాధితులకు చికిత్స అందజేయడానికి ప్రత్యేకంగా 1,000 పడకల హాస్పిటల్‌నే సిద్ధం చేశారు. తాజాగా, భువనేశ్వర్, భద్రక్ పట్టణాలను పూర్తిగా 48 గంటల పాటు షట్‌డౌన్ చేస్తున్నట్టు ఒడిశా సీఎం ప్రకటించారు. ఇప్పటి వరకూ ఒడిశాలో మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. తబ్లీగ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న ఓ వ్యక్తికి తాజాగా వైరస్ సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది.